Thought Economics- War & Peace - Part 11

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-11

ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

 

ప్రశ్న 36. సంఘర్షణ రహిత ప్రపంచంగా ఉండాలంటే ఏమి చేయాలి?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: యుద్ధ నివారణకే కాకుండా సుస్థిర శాంతికి ప్రతి రోజు కృషి చేసే అనేక మంది  వ్యక్తులు, సంస్థలు ఈ ప్రపంచంలో చాలా మంది  ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలలో పని చేసి ఆత్మ హత్యలు చేసుకునే అమెరికా సైనికుల సంఖ్య రోజుకు 22 కు పైగానే ఉంది. వారిని మనం హీరోలుగా, గాయపడిన యోధులుగా  పిలుచుకుంటాము. వారిని మన ప్రముఖ ఆటలప్పుడు తలుచుకుంటూనే ఉంటాము. వారి సంక్షేమము గురించి పని చేయాల్సిన వెటరన్స్ చాలా ఘోరంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రోజుకు 22 మంది చొప్పున మరణిస్తున్నారు. యుద్ధానికి ప్రజలను పంపించే ముందర మనం అన్నీ విషయాలపై అవగాహన పెంచుకోవాలి. “మేము గెలిచాము” అని కేవలం చెప్పుకోవటం కాదు. గెలిచినట్లు అనుకోవటమూ కాదు.

విద్య చాలా కీలకమైనది. “పీస్ జామ్” అనే ఒక సంస్థ ప్రపంచమంతటా పరికించి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలను గురించి అధ్యయనం చేసి, వారి జీవిత చరిత్రల చుట్టూ పాఠ్యాంశాలను తయారు చేస్తుంది. విద్యార్థులు వాటిని అధ్యయనం చేసి, కోర్సు చివరిలో సంబంధిత నోబెల్ శాంతి బహుమతి గ్రహీతతో కొద్ది కాలం గడుపుతారు. శాంతికి గల వివిధ మార్గాలను తెలుసుకోవడం ఇక్కడ ప్రాధాన్యం. శాంతికి ఎవరు విఘాతం (ఒబామా, కిసెంజర్ ) కల్పించారో కూడా తెలుసుకుంటారు.        

ప్రశ్న 37. ఘర్షణకు దూరంగా ప్రపంచం ఉండగలదా?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: ప్రజలు జాగ్రత్తగా ప్రవర్తిస్తే మన పిల్లల సమయంలో గానీ లేదా మన మనవల  సమయంలో గానీ దీనిని సాధించవచ్చును. రాజధానులలో నివసిస్తూ, తమకు ఎక్కువ అధికారం, డబ్బు, వనరుల కోసం ఇతరులను యుద్ధాలకు పంపించే నాయకులకు ఎదురు నిలిచే  ధైర్యం ప్రజలలో రావాలి.

అధ్యక్షులు మార్టి అతిసారి: ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు నేను నివసించే భూభాగం నుంచి ఆలోచిస్తాను. ప్రజల మద్దతుతో,  కలుపుకుపోయే విధానాలతో, సమసమాజం నిర్మిస్తే మనం ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పిస్తూ, ఘర్షణ లేకుండా సమాజాన్ని నిర్వహించవచ్చు. అమెరికా వంటి దేశాలలో జైళ్ళలో మగ్గుతున్న జనాభా శాతమును చూస్తే మనకు సమ సమాజ విధానాలు లేవని సులభంగా అర్థమవుతుంది. విద్యా, ఉద్యోగ అవకాశాలు లేకపోతే ప్రజలు ఒక సామాజిక వర్గం నుండి ఇంకొక సామాజిక వర్గమునకు పురోగతి సాధించలేరు. వివరాల్లోకి వెళితే, తరతరాలుగా విద్యావకాశాలు లేకుండా, వారు నేరస్తుల ముఠాల్లోకి, మాదక ద్రవ్యాల ముఠాల్లోకి ప్రవేశిస్తున్నారు.  

ఒక ఆర్థికవేత్త అన్నట్లు “ అమెరికా కల సాధించాలంటే స్వీడెన్ వెళ్ళాలి”. చాలామంది నార్దిక్ దేశాల సజాతీయత వల్ల ఇలా సాధ్యపడింది అని అంటుంటారు. కానీ స్వీడెన్ లో ప్రస్తుతం యునైటెడ్ కింగ్డం కంటే తక్కువ సజాతీయత వుంది.  అంతే కాకుండా మన పాతతరం ఆలోచనలు కూడా మన ప్రగతిని అడ్డుకుంటున్నాయి. ముఖ్యంగా మనం రష్యాకు స్పష్టంగా చెప్పాలి- ప్రచ్చన్న యుద్ధ కాలం అయిపోయిందని. పశ్చిమ దేశాలు రష్యాని సైనికంగా ఎదుర్కొలేవు, నాటోకి ఆ బలం కూడా లేదు. కాబట్టి రష్యా అసలు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ డబ్బును న్యాయ రక్షణకు, విద్యకు నిక్షేపంగా ఖర్చు పెట్టవచ్చు.

రాబోయే కాలంలో మనం సహకారంతో నివసిస్తూ సంఘర్షణలను నివారించవచ్చును.

బెన్ ఫెరెఙ్క్జ్:  మీ ప్రశ్నకు నా సమాధానం “వీలు కాదు”. అయితే ఇలా అని నేను తప్పించుకోను, ఎందుకంటే నా సమాధానం ముసుగుతో ఉన్నది. మనం శాంతిని సాధించే దిశలో సాగుతున్నాము, కానీ ఆ మార్గం పరిపూర్ణంగా ఉండదు. పరిపూర్ణతను మనం ఆశించకూడదు కూడా. అక్కడక్కడా లోపాలు ఉన్నాయని మనం శాంతి మార్గాన్ని విడనాడకూడదు. మనం ప్రగతి సాధించాలి కూడా. మనం ఇప్పటివరకు సాధించిన ప్రగతి సరిపోదు. జరుగుతున్న నేరాలు చాలా దౌర్జన్యమైనవి.  శతాబ్దాలుగా ఘనత సాధించినవిగా పేర్కొన్న చర్యలను ఒక్కసారే ఆపలేము. శతాబ్దాలుగా యుద్ధం పేరుతో జరిగిన మారణ  హోమాలను మనం ఒక్క ఒప్పందంతోనే ఆపలేము. మన దగ్గర సరైన సమాధానం కూడా లేదు.

ప్రశ్న 38. మీరు గమనించిన అతి ముఖ్య క్షమాపణ చర్యలు ఏవి?

మారినా కాంతకుజినో: “క్షమా గుణం ఉన్న వారి దళం”  నేను తయారు చేయాలని కోరుకోవట్లేదు. ఏదో అవార్డు గురించి క్షమాగుణం ఉన్న వాళ్ళని సూచించమని నన్ను కోరుతూ ఉంటారు. నేను సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటాను. కొంతమంది ఎక్కువ క్షమాగుణం కలిగిన వారు, వారు ఉన్నతంగా క్షమించగలరు అని పోల్చి  చూడటం మనకు ఎక్కువ సహాయకరం కాదు. గార్డియన్ పత్రికలో ఒక సారి ఒక వార్తా కథనం వచ్చింది. ఇరాన్ లోని ఒక తల్లి, తన కొడుకుని చంపిన హంతకుడిని ఉరి తీసే సందర్భంలో, ఉరి తీయబడే వ్యక్తి మెడ చుట్టూ ఉరితాడు బిగియగానే- అతన్ని క్షమించమని, ఆ ఉరి తాడును తీసేయమని  వేడుకున్నది. ఈ వార్త  ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. వైరల్ అయ్యింది. సాధారణ ప్రతీకార కథనాల కంటే ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. ఈ కథనం బట్టి ఒక శాంతియుత భవిష్యత్తు గురించి మనకు ఒక ఆశ కలుగుతుంది. ఇటువంటి స్ఫూర్తిదాయక కథలను ఇతరులతో పంచుకొనుట నా ముఖ్యమైన పని. దానవత్వంను  పంఛుకొనుట కన్నా మానవత్వాన్ని పంచుకొనుట నాకు స్పూర్తినిస్తుంది.            

ప్రశ్న 39. శాంతిని నెలకొల్పటంలో మన తర్వాతి తరానికి మీరు ఇచ్చే సందేశమెంటి?

డాక్టర్ శిరీన్ యెబడి:  మీ గురించి మీరు ఏం కోరుకుంటున్నారో అదే అందరికీ జరగాలని, శాంతిని తమ సమాజంలో చూడాలని కోరుకునే వాళ్ళు భావించాలి. మీకు ఏదైతే చెడును కలిగిస్తుందో, అదే అందరికీ చెడును కలిగిస్తుందని భావించాలి. అదే నా తర్వాత తరానికి, శాంతిని ప్రపంచంలో చూడాలని కోరుకునేవారికి  నేను ఇచ్చే సందేశం.  

 

 

ప్రశ్న 40. శాంతి యుత ప్రపంచ నిర్మాణం కోసం మీ సందేశమేంటి?

అధ్యక్షులు మార్టి అతిసారి: మన తప్పుల నుండి నేర్చుకొమ్మని తర్వాత తరానికి నేను చెబుతాను. చరిత్ర నుండి మనం ఏమీ నేర్చుకోలేదని నాకు ఆందోళనగా ఉంది. మనం కొన్ని సందర్భాలకు ఎలా చేరుకున్నాము అనేది మనం గమనిస్తే అటువంటి సందర్భాలను రాకుండా పూర్తిగా నియంత్రించే అవకాశం ఉన్నది.  ఈ రోజు యూరోప్ లో ప్రజారంజక ఉద్యమాలకు  ఎంత మద్దతు లభిస్తోందో మనం గమనిస్తే మేధోపరమైన చర్చలు ఎంతమాత్రమూ లేవని నాకనిపిస్తోంది. నిజాలు తెలుసుకొనుట చాలా ముఖ్యం. ఒక సందర్భాన్ని మనం బాగా విశ్లేషించాలి. దాని వెనక కారణాలను అన్వేషించాలి. నా తర్వాత తరం మరింత తెలివితేటలు కలవారు. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను.  

ఇంకా ఉంది

https://peacesimplified.blogspot.com/

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా

Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War and Peace- Part 7

Reality of War by Dalai Lama - Translated to telugu